కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య
- గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
- బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు
- గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే హోంమంత్రి అనితను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. "పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.
వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య పొలాల్లో ఆరు షెడ్లు వేసి అడబాల వీరబాబు అనే వ్యక్తి ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పేలుడు ధాటికి వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి.
కాగా, మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది కార్మికులు బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఈ పరిశ్రమలో గతంలోనూ పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.