'సాక్షి' కథనంపై హెరిటేజ్ ఫుడ్స్ ఫైర్... ప్రకటన విడుదల
- తమపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించిన హెరిటేజ్ ఫుడ్స్
- టీటీడీకి నెయ్యి సరఫరా చేశామన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టీకరణ
- ఇందుపూర్ డైరీతో నెయ్యి తయారీకి ఎలాంటి ఒప్పందం లేదని వెల్లడి
- ఇది రాజకీయ ప్రేరేపిత దుష్ప్రచారమని, సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర అని ఆరోపణ
- వైసీపీ నేతలు, సాక్షి మీడియా ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రకటన
ఇందాపూర్ డైరీతో సంబంధం లేదు
ఈ కథనంలో పేర్కొన్నట్టుగా మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎలాంటి యాజమాన్య లేదా సంస్థాగత సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇందాపూర్ డైరీ అనేది ఒక స్వతంత్ర ప్రైవేట్ సంస్థ అని, దాని యాజమాన్యం, నిర్వహణ, కార్యకలాపాలు పూర్తిగా వేరని వివరించింది. తమకు ఇందాపూర్ డైరీతో కేవలం పనీర్, చీజ్, యూహెచ్‌టీ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (SMP) తయారీకి మాత్రమే కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ఒప్పందం ఉందని, నెయ్యి తయారీకి గానీ, సరఫరాకు గానీ ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు నెయ్యి సరఫరా చేసేందుకు ఇందాపూర్ డైరీతో తాము ఎన్నడూ ఒప్పందం చేసుకోలేదని తెలిపింది.
రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు
2014-2019 మధ్య కాలంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్లు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందాపూర్ డైరీతో పాటు మరో ఐదు డైరీలను సిండికేట్‌గా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ నిరాధార ఆరోపణలను వైసీపీ నాయకులు, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారు, సాక్షి మీడియా ద్వారా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని హెరిటేజ్ ఆరోపించింది. ఇవి కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని పేర్కొంది. గడచిన 33 సంవత్సరాలుగా రైతులు, వినియోగదారులకు నిజాయతీగా సేవలు అందిస్తున్న తమ సంస్థపై ఇలాంటి బురద జల్లడం దారుణమని తెలిపింది.
ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకునేందుకు తమ అధికారిక వెబ్‌సైట్ (heritagefoods.in)ను సందర్శించాలని హెరిటేజ్ ఫుడ్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ అధికారికంగా రిజాయిండర్ విడుదల చేసింది.