ఇంట్లోకి చొరబడి మరీ కొడుతుంది... ధురంధర్-2 టీజర్ వచ్చేసింది... వీడియో ఇదిగో!
- విడుదలైన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్: ది రివెంజ్' టీజర్
- 2026 మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల
- భారీ విజయం సాధించిన 'ధురంధర్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా
- ఆదిత్య ధర్ దర్శకత్వం
ఒక నిమిషం 12 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో, రణ్‌వీర్ పోషిస్తున్న హమ్జా అలీ మజారీ పాత్ర యవ్వనంలోని జీవితాన్ని చూపించారు. పాకిస్థాన్‌లోని ల్యారీ టౌన్‌ను శాసించే ఓ క్రూరమైన గ్యాంగ్‌లో అతను ఎలా ఎదిగాడో, స్పైగా మారకముందు అతని నేపథ్యం ఏమిటో ఈ టీజర్ తెలియజేస్తోంది. టీజర్‌తో పాటు "అబ్ బిగడ్నే కా వక్త్ ఆ గయా హై" అనే క్యాప్షన్‌తో ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. మొదటి భాగంలో చనిపోయిన అక్షయ్ ఖన్నా పాత్ర ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనుంది.
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్, ఆదిత్య ధర్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,320 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు 'ధురంధర్ 2' చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.