కేసీఆర్‌కు నోటీసులు... 'సిట్'కు కొత్త అర్థం చెప్పిన హరీశ్ రావు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏర్పాటైన సిట్ ఒక "సీఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్" అన్న హరీశ్
- కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని ఆగ్రహం
- పాలనలోని వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా అంటూ విమర్శలు
- చట్టబద్ధం కాకపోయినా కేసీఆర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని వెల్లడి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో పరాకాష్ఠ అని హరీశ్ రావు అభివర్ణించారు. ఈ నోటీసుల వెనుక చట్టం లేదని, కేవలం సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, రాజకీయ ప్రతీకారం మాత్రమే ఉన్నాయని ధ్వజమెత్తారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన నేతకు కనీస మర్యాద ఇవ్వకుండా, ఆయన నివాసం ఎక్కడ ఉందో రాష్ట్రమంతటికీ తెలిసినా, నందినగర్‌లోని ఇంటి గోడకు నోటీసులు అంటించడం కాంగ్రెస్ ప్రభుత్వ చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
పాలన చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ సిట్ డ్రామా ఆడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. వరుస కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చరిత్రను సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్ధం కానప్పటికీ, అనుసరించిన విధానం రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ.. కేసీఆర్ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, భారత పౌరుడిగా దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని, గజ్వేల్ నుంచి హైదరాబాద్ వరకు వేలాది మందిని మోహరించి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిని ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతుల కష్టాలు, యువత ఉద్యోగాలు, పింఛన్ల పెంపు వంటి అంశాలను గాలికొదిలి, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు.