ఓటీటీలోకి వస్తున్న శ్రీలీల తమిళ సినిమా
- ఓటీటీలోకి శివకార్తికేయన్, శ్రీలీల 'పరాశక్తి'
- ఫిబ్రవరి 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న చిత్రం
- సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందన పొందిన సినిమా
- హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో చిత్రం
- సుధా కొంగర దర్శకత్వం
సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' ఒక పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. 1964లో తమిళనాడులో హిందీని జాతీయ భాషగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విద్యార్థులు, గ్రామస్తులు పోలీసులతో ఘర్షణపడిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో పలు వివాదాస్పద సంభాషణలు ఉండటంతో సెన్సార్ బోర్డు 20కి పైగా కట్స్ సూచించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో శివకార్తికేయన్, శ్రీలీలతో పాటు జయం రవి, అధర్వ మురళి కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన 'పరాశక్తి' ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.