సైట్ విజిట్ రూల్ పెట్టిన టెండర్లన్నీ రద్దు చేయాలి: హరీశ్ రావు
- ఆ నిబంధన తొలి లబ్దిదారు సృజన్ రెడ్డి అని ఆరోపణ
- బొగ్గు స్కాం బయటపెట్టినందుకు తమపై బురద జల్లుతున్నారని ఫైర్
- తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత
భట్టి విక్రమార్క తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు స్కామ్ నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. నిజానికి 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన వచ్చిందని హరీశ్ రావు చెప్పారు. ఈ నిబంధన వల్ల లబ్ది పొందిన మొదటి వ్యక్తి సృజన్ రెడ్డి అని చెప్పారు.
సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ బంధువు కావడంతో టెండర్లలో ఎలాంటి స్కామ్ జరగలేదంటూ భట్టి విక్రమార్క ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎలాంటి స్కాం జరగనప్పుడు నైనీ టెండర్లు ఎందుకు రద్దు చేశారని హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. నైనీ టెండర్లు మాత్రమే కాదు.. సైట్ విజిట్ విధానం అమలు చేసిన టెండర్లన్నీ రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.