మా అల్లరి ఎలా ఉంటుందో థియేటర్‌లో చూస్తారు: హీరో రవితేజ
- ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో ఫైట్లు కూడా హాస్యంగా, ప్రేక్షకులను నవ్వించేలా ఉంటాయన్న రవితేజ
- అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్ లాంటి దర్శకులతో పని చేయడం తనకు చాలా ఇష్టమని వెల్లడి
- ఈ సినిమాతో తనకు, దర్శకుడు కిశోర్‌కు మంచి హిట్ ట్రాక్ ఏర్పడాలన్న రవితేజ
సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో దర్శకులు హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫైట్లు కూడా హాస్యంగా, ప్రేక్షకులను నవ్వించేలా ఉంటాయన్నారు.
తాను ఈ సినిమాలో అందంగా కనిపించానంటే అందుకు కారణం సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లేనని పేర్కొన్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి పని చేయడాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తానని చెప్పారు. అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్ లాంటి దర్శకులతో పని చేయడం తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఈ సినిమాతో తనకు, దర్శకుడు కిశోర్‌కు మంచి హిట్ ట్రాక్ ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని రవితేజ ధీమా వ్యక్తం చేశారు.