గ్రేటర్ పోలీసు వ్యవస్థలో భారీ మార్పులు.. నలుగురు సీపీల నియామకం
- హైదరాబాద్ పోలీసు వ్యవస్థలో భారీ పునర్వ్యవస్థీకరణ
- కొత్తగా మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల ఏర్పాటు
- ఫ్యూచర్ సిటీకి కమిషనర్‌గా సుధీర్‌బాబు
- సైబరాబాద్ సీపీగా రమేశ్, మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి
- కమిషనరేట్ పరిధి నుంచి యాదాద్రి భువనగిరి మినహాయింపు
ఈ నూతన విధానంలో కమిషనరేట్ల పరిధిని ప్రభుత్వం స్పష్టంగా విభజించింది. అసెంబ్లీ, సచివాలయం, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి కీలక ప్రాంతాలతో హైదరాబాద్ కమిషనరేట్ కొనసాగనుండగా.. ఐటీ హబ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలతో సైబరాబాద్‌ను మార్పు చేశారు. కీసర, షామిర్‌పేట, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలతో కొత్తగా 'మల్కాజిగిరి' కమిషనరేట్‌ను.. చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం వంటి ప్రాంతాలతో 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో యాదాద్రి-భువనగిరి ప్రాంతాన్ని కమిషనరేట్ పరిధి నుంచి తొలగించి, ప్రత్యేక ఎస్పీ నేతృత్వంలో జిల్లా పోలీసు యూనిట్‌గా మార్చారు.
నూతన సీపీల నియామకం
ఈ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* హైదరాబాద్ సీపీ: వీసీ సజ్జనార్ (కొనసాగింపు)
* సైబరాబాద్ సీపీ: ఎం.రమేశ్ (గతంలో లాజిస్టిక్స్ ఐజీ)
* మల్కాజిగిరి సీపీ: అవినాశ్ మహంతి (గతంలో సైబరాబాద్ సీపీ)
* ఫ్యూచర్ సిటీ సీపీ: జి.సుధీర్ బాబు (గతంలో రాచకొండ సీపీ)
* యాదాద్రి-భువనగిరి ఎస్పీ: అక్షాంశ్ యాదవ్
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా చేరిన 27 మున్సిపాలిటీలు, జోనింగ్ సంస్కరణల నేపథ్యంలో ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.