అజిత్ ఫ్యాన్స్ కు షాక్.. ఇళయరాజా పిటిషన్ తో నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా నిలిపివేత
- అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని తొలగించిన నెట్‌ఫ్లిక్స్
- ఇళయరాజా పాటల కాపీరైట్ వివాదమే కారణం
- అనుమతి లేకుండా పాటలు వాడారని ఇళయరాజా ఫిర్యాదు
- సినిమాలో పాటలు ప్రదర్శించొద్దన్న మద్రాసు హైకోర్టు
- అన్ని అనుమతులు ఉన్నాయంటున్న చిత్ర నిర్మాత
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైంది. అనంతరం మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ చిత్రంలో తన పాటలను ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ సంగీత దిగ్గజం ఇళయరాజా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, వెంటనే ఆ పాటలను సినిమా నుంచి తొలగించి, తనకు తగిన నష్టపరిహారం చెల్లించాలని తన పిటిషన్‌లో ఆయన కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఇళయరాజాకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలో ఆయన స్వరపరిచిన పాటలను ప్రదర్శించవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫామ్ నుంచి తీసివేసినట్లు సమాచారం.
అయితే, ఈ వివాదంపై చిత్ర నిర్మాత రవి ఇటీవల స్పందించారు. సినిమా విడుదలకు ముందే తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు లోబడే పాటలను వాడుకున్నామని ఆయన స్పష్టం చేశారు.