విజయవాడ సబ్ జైల్ వద్ద కలకలం.. లిక్కర్ కేసు నిందితుల ఆందోళన
- బెయిల్ ఇచ్చినా సరే విడుదల చేయడంలేదని నిరసన
- గేటు లోపల బాలాజీ గోవిందప్ప.. జైలు ముందు న్యాయవాదుల బైఠాయింపు
- జైలు సూపరిటెండెంట్‌పై న్యాయవాదులు ఫైర్
బెయిల్ ఇచ్చినా అధికారులు తమను విడుదల చేయకపోవటంతో జైలు లోపల గేటు దగ్గర బాలాజీ గోవిందప్ప ఆందోళనకు దిగారు. డీఐజీ డౌన్ డౌన్ అంటూ నిందితులు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, నిందితుల తరఫున వాదిస్తున్న అడ్వకేట్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ‘శనివారం సాయంత్రమే బెయిల్ ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు వారిని ఇప్పటికీ విడుదల చేయలేదు. ఇది చట్టవిరుద్ధ నిర్బంధం కిందకు వస్తుందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళతాం’ అని తెలిపారు.
హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు..?
లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు జారీ చేసిన బెయిల్ పై ప్రాసిక్యూషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని మరికాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.