టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై మరో కేసు నమోదు
- కోకాపేట విల్లాలో దాడి చేయించారని లావణ్య అనే మహిళ ఫిర్యాదు
- అనుచరులతో కొట్టించి, నగలు ఎత్తుకెళ్లారని ఆరోపణ
- పెంపుడు కుక్కలను కూడా చంపేశారని ఫిర్యాదులో వెల్లడి
ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. కోకాపేటలోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటుండగా రాజ్ తరుణ్ పంపిన కొందరు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. మూడు వేర్వేరు సందర్భాల్లో తనను దుర్భాషలాడుతూ, బెల్టులు, గాజు సీసాలతో విచక్షణారహితంగా కొట్టారని లావణ్య తెలిపింది. ఈ దాడిలో తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా లాక్కెళ్లారని, తన పెంపుడు కుక్కలను సైతం చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వివాదం వెనుక కోకాపేట విల్లాకు సంబంధించిన గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. 2016లో తాను, రాజ్ తరుణ్ కలిసి ఈ విల్లాను కొనుగోలు చేశామని, అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ ఏడాది మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడని లావణ్య వివరించింది. ఈ విల్లా యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ దాడి జరిగిందని ఆమె పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.