ఆ స్టార్ హీరోయిన్‌ను ఇంప్రెస్ చేయడానికే నాన్న బెంగాలీ నేర్చుకున్నారు: శృతి హాసన్
- తండ్రి కమల్ హాసన్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శృతి
- అపర్ణ సేన్‌ను ఇంప్రెస్ చేయడానికి బెంగాలీ నేర్చుకున్నారని వెల్లడి
- 'హేరామ్'లో రాణి ముఖర్జీ పేరు కూడా 'అపర్ణ' అనే పెట్టారన్న శృతి
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఇంటర్వ్యూలో నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ, కమల్ హాసన్ ఏదైనా విషయాన్ని చాలా వేగంగా నేర్చుకుంటారని, ఆయనకు బెంగాలీ భాష కూడా వచ్చని ప్రస్తావించారు. వెంటనే శృతి హాసన్ జోక్యం చేసుకుని, తన తండ్రి ఆ భాష నేర్చుకోవడానికి గల అసలు కారణాన్ని వివరించారు.
“నాన్న బెంగాలీ ఎందుకు నేర్చుకున్నారంటే, దానికి కారణం అపర్ణ సేన్. ఆమె అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆమెను ఆకట్టుకోవడం కోసమే ఆయన ఆ భాష నేర్చుకున్నారు. అంతేకాదు, ‘హేరామ్’ సినిమాలో రాణి ముఖర్జీ పోషించిన పాత్రకు కూడా 'అపర్ణ' అనే పేరు పెట్టారు. ఇదంతా ఆమెపై ఉన్న అభిమానంతోనే చేశారు” అని శృతి హాసన్ తెలిపారు.
శృతి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు, కమల్ అభిమానులు ఆయన వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చించుకుంటున్నారు. “కమల్ గారి ప్రేమకథలు కూడా ఆయన సినిమాల్లాగే చాలా ఆసక్తికరంగా ఉంటాయి” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.