ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. ‘కాళేశ్వరం’ నివేదికపై చర్చ!
- సభ ముందుకు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ కాళేశ్వరం నివేదిక
- ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం
- అసెంబ్లీలో చర్చించాకే కాళేశ్వరం అవకతవకలపై చర్యలని కోర్టుకు స్పష్టం చేసిన ప్రభుత్వం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అయితే, ఈ నివేదికను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది.
విచారణ సందర్భంగా, అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిపిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరఫున కోర్టుకు స్పష్టం చేశారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఒకవేళ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.