వైఎస్ భారతి కూడా పులివెందుల నుంచి అమరావతికి ఫ్రీగా రావచ్చు: పీతల సుజాత
- మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ఓ గొప్ప కానుక అన్న పీతల సుజాత
- పథకంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపాటు
- ఆడబిడ్డలను వృద్ధిలోకి తేవడమే టీడీపీ విధానమని వ్యాఖ్య
మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత అన్నారు. రాష్ట్రంలోని మహిళల తరఫున 'స్త్రీ శక్తి' పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాఖీ పండుగలాగే ఈ పథకాన్ని కూడా మహిళలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇంత మంచి పథకంపై వైసీపీకి చెందిన పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని సుజాత తెలిపారు. గత ప్రభుత్వంలా కాకుండా, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేశామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో వైఎస్ భారతి కూడా పులివెందుల నుంచి అమరావతికి జీరో ఛార్జీతో రావొచ్చని ఆమె అన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రానున్న నాలుగేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళతామని సుజాత ధీమా వ్యక్తం చేశారు.