ముంబయి రైలు పేలుళ్ల తీర్పుపై సుప్రీం స్టే
- విడుదలైన వారిని మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరంలేదన్న సుప్రీం
- ఆ 12 మందీ నిర్దోషులేనని ఇటీవల హైకోర్టు తీర్పు
- తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర ప్రభుత్వం
2006 లో ముంబయిలోని సబర్బన్ రైళ్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. మొత్తం 189 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 800 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు 12 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు వారిని జైలుకు పంపించింది. బాంబులు అమర్చినట్లు తేలిన ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. దీనిపై నిందితులు హైకోర్టులో అప్పీలు చేయగా.. ఇటీవల వారందరినీ హైకోర్టు నిర్దోషులుగా తేల్చి విడుదలకు ఆదేశించింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న కాలంలో నిందితుల్లో ఒకడు నాగ్ పూర్ జైలులో మరణించాడు. హైకోర్టు తీర్పుతో పదకొండు మంది నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు.