కొడాలి నాని, జోగి రమేశ్, వంశీ తప్పించుకోలేరు: మంత్రి కొల్లు రవీంద్ర
- కొడాలి నాని, జోగి రమేశ్, వంశీల అవినీతిని బయటపెడతామని కొల్లు రవీంద్ర హెచ్చరిక
- ఏపీ లిక్కర్ స్కామ్‌పై తీవ్ర ఆరోపణలు
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని వ్యాఖ్య
మంగళవారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సోర్లగోంది గ్రామంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ప్రజల సంపదను దోచుకున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాను కొడాలి నాని, జోగి రమేశ్, వల్లభనేని వంశీ ముఠా ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో సర్వనాశనం చేశారు. వారి అవినీతి చిట్టాను ఆధారాలతో సహా సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ప్రజల ముందుంచి, వారి నుంచి ప్రతి పైసా కక్కిస్తాం" అని హెచ్చరించారు.
"వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఇప్పుడు చీమల పుట్ట కదిలింది, అందరి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తాయి" అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొందరు ప్రజల్లో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు సాగవని అన్నారు. గాడి తప్పిన పాలనను తాము నెల రోజుల్లోనే సరిదిద్దామని, ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు అందించి సుపరిపాలనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.