కోర్టుకు చేరుకున్న గాలి జనార్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి.. తీర్పు వెలువరించనున్న సీబీఐ కోర్టు
- ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు
- దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ
- సుప్రీంకోర్టు ఆదేశాలతో ముగిసిన వాదనలు, నేడు తీర్పు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను 2009లో సీబీఐకి అప్పగించింది. లోతైన దర్యాప్తు జరిపిన సీబీఐ, 2011లో తొలి ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ తర్వాత మిగిలిన నిందితులపై పలు అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. మొత్తం తొమ్మిది మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చగా, విచారణ కొనసాగుతుండగానే నిందితుల్లో ఒకరైన లింగారెడ్డి మరణించారు. మరో నిందితురాలైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని 2022లో హైకోర్టు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది.
ఈ కేసు విచారణను మే నెలలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెలలోనే ఇరుపక్షాల వాదనలను ముగించింది. ఈ క్రమంలో మిగిలిన నిందితులపై సీబీఐ కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. దీంతో దశాబ్దన్నర కాలంగా నలుగుతున్న ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తుందనే దానిపై రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది.