హీరో రామ్ పోతినేనితో డేటింగ్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ
- రామ్ పోతినేనితో భాగ్యశ్రీకి ఎంగేజ్ మెంట్ అయిందంటూ ప్రచారం
- భాగ్యశ్రీకి రామ్ రింగ్ తొడిగాడంటూ పుకార్లు
- ఆ రింగ్ తానే కొనుక్కున్నానన్న భాగ్యశ్రీ
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భాగ్యశ్రీ, ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్, "మీ చేతికి ఉన్న ఉంగరం ఎవరు తొడిగారు?" అని ఆమెను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, "ఆ ఉంగరం నాకు ఎవరూ తొడగలేదు, నేనే కొనుక్కున్నాను" అని భాగ్యశ్రీ బదులిచ్చారు. దీంతో ఆమె ఎంగేజ్‌మెంట్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పరోక్షంగా వెల్లడించారు.
భాగ్యశ్రీ ఇచ్చిన ఈ సమాధానంతో, వారిద్దరి రిలేషన్ షిప్ పై వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. అయితే, గతంలో వీరిద్దరూ ఒకే చోట ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'RAPO 22' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నందున, షూటింగ్ నిమిత్తం కలిసే ఉండి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్, ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు.