మావల్లే మీకు జీతాలు వస్తున్నాయి: ఇంగ్లండ్ మాజీలపై సునీల్ గవాస్కర్ సెటైర్లు
- ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లు దుబాయ్ లో ఆడుతున్న ఇండియా
- ఇది ఇండియాకు అనుకూలంగా మారిందన్న ఇంగ్లండ్ మాజీలు
- మీ సొంత జట్టుపై దృష్టి సారిస్తే మంచిదని గవాస్కర్ ఎద్దేవా
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీలు (నాజర్ హుస్సేన్, మైక్ ఆర్థర్టన్) మాట్లాడుతూ... ఒకేచోట అన్ని మ్యాచ్ లు ఆడటం ఇండియాకు ప్రయోజనకరంగా మారిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఇంగ్లండ్ మాజీలపై సెటైర్లు వేశారు. ఇలాంటి కామెంట్లు చేయడం మానేసి... సొంత జట్టుపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు.
సెమీస్ కు ఇంగ్లండ్ ఎందుకు అర్హత సాధించలేకపోయిందో సమీక్షించుకోవాలని... భారత జట్టుపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని గవాస్కర్ అన్నారు. అంచనాలను అందుకోవడంలో మీ ఆటగాళ్లు విఫలమైనట్టు అనిపిస్తోందని... ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో మీ ప్లేయర్స్ ఉన్నారని వ్యాఖ్యానించారు.
దేశం కోసం ఆడేటప్పుడు ఎంతో బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని గవాస్కర్ సూచించారు. భారత్ కు అలాంటి అవకాశం వచ్చింది, మాకు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియా ఎంతో సేవ చేస్తోందని... ఆటపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోందని అన్నారు. టీవీ, మీడియా హక్కుల ద్వారా భారీగా ఆదాయం వస్తోందని... మీకు వస్తున్న శాలరీలు కూడా పరోక్షంగా భారత్ వల్లే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చురక అంటించారు.