హరీశ్ రావును ఇరికించాలని చూస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్న ప్రవీణ్ కుమార్
- చిన్న చిన్న అంశాల్లో కూడా హరీశ్ పై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శ
- పోలీస్ ఉన్నతాధికారులు కూడా రేవంత్ అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపాటు
యాదాద్రిలో రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఒట్టు పెట్టారని... ఆ మాట నిలుపుకోలేదని హరీశ్ రావు ప్రశ్నిస్తే అక్కడ కూడా కేసు పెట్టారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరులో కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న అంశాల్లో కూడా హరీశ్ పై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రేవంత్ మాదిరి హరీశ్ ఓటుకు నోటు కేసులో లేరని చెప్పారు.
పోలీసు ఉన్నతాధికారులు కూడా రేవంత్ అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. తాను కూడా ఐపీఎస్ అధికారిగా పనిచేశానని... సీఎంలు ఒత్తిడి చేసినంత మాత్రాన ఐపీఎస్ అధికారులు పక్షపాతంతో వ్యవహరించకూడదని చెప్పారు. హరీశ్ రావు, ఆయన అనుచరులపై పోలీసులు కక్షగట్టి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.