కిరణ్ రాయల్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
- తిరుపతి జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ పై మహిళ తీవ్ర ఆరోపణలు
- తనను మోసం చేశాడని సెల్ఫీ వీడియో
- రూ.1.20 కోట్లు ఎగ్గొట్టాడని వెల్లడి
- మహిళ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న జనసేన హైకమాండ్
తనకు అప్పులు ఇచ్చిన వాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, కిరణ్ రాయల్ ఆ డబ్బు ఇవ్వకపోతే తనకు చావు తప్ప మరో మార్గం లేదని ఆ మహిళ వాపోయింది. ఈ క్రమంలో, కిరణ్ రాయల్... సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఓ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ హైకమాండ్ స్పందించింది. ఆరోపణలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేంత వరకు తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్టీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు జనసేన వ్యవహారాల్లో కిరణ్ రాయల్ జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి, సమాజానికి ఉపయోగపడని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని జనసైనికులకు, వీరమహిళలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని ఆ ప్రకటనలో వివరించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.