రేవంత్ కు ఏం తెలుసు?... అదొక లొట్టపీసు కేసు: కౌశిక్ రెడ్డి
- కేటీఆర్ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అన్న కౌశిక్ రెడ్డి
- టెస్లా కంపెనీని తెలంగాణకు తీసుకు రావడమే కేటీఆర్ లక్ష్యమని వ్యాఖ్య
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమపై కేసులు పెడుతున్నారా? అని ప్రశ్న
కేటీఆర్ పై పెట్టిన కేసు ఒక లొట్టపీసు కేసు అని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ-రేసు కోసం వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉందని... అలాంటి పోటీని తట్టుకుని కేటీఆర్ తెలంగాణకు తీసుకొస్తే... రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. టెస్లా కంపెనీని తెలంగాణకు తీసుకురావడమే కేటీఆర్ లక్ష్యమని... అందుకే కారు రేసును రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలిపారు.
కేసీఆర్ కుటుంబంలో నలుగురు పోతే... రాష్ట్రంలో 60 లక్షల మంది కేసీఆర్ లు తయారవుతారని చెప్పారు. కరీంనగర్ సమావేశంలో తాను ఆర్డీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని... కానీ తనపై ఆరుగురితో కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఖమ్మంలో హరీశ్ రావుపై దాడి జరిగితే కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ ఇచ్చిన బీ ఫామ్ పై గెలిచిని ఎమ్మెల్యే సంజయ్ ను నిలదీస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరపున గెలిచి... బీఆర్ఎస్ నే తిడితే తాను ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అని... రేవంత్ కు ఏమి తెలుసని ప్రశ్నించారు. రేసు విషయంలో మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారని... ప్రొసీజర్ తో ఆయనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేసులకు తాము భయపడమని, చట్ట ప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు.