Allu Arjun: పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
- బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న పుష్ప 2
- హైదరాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమం
- కల్యాణ్ బాబాయ్ అని సంభోదిస్తూ థాంక్ యూ సో మచ్ అని అన్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక, శ్రీ లీల హీరోయిన్లుగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప- 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 5న గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటివరకూ రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు కల్యాణ్ బాబాయ్ అని అల్లు అర్జున్ సంభోదిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం సినీ, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల సమయంలో మెగా కుటుంబం మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేయగా, ఆ కుటుంబానికే చెందిన అల్లు అర్జున్ .. నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి రవి గెలుపుకు ప్రచారం చేయడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అప్పటి నుంచి పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్‌యే నడిచింది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నట్లుగానూ ప్రచారం జరిగింది. దీంతో వీరి అభిమానుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో మూవీ విజయోత్సవ కార్యక్రమంలో తమ మధ్య విభేదాలు ఏమీ లేవన్నట్లు సంకేతాలు ఇచ్చేలా అల్లు అర్జున్ మాట్లాడటంతో ఫాన్స్ ఖుషీ అయ్యారు.
విజయోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్.. సినిమా టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చిన తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. 'స్పెషల్ జీవో పాస్ అయి ప్రత్యేక ధరలు వచ్చేందుకు మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు' అని అన్నారు. వ్యక్తిగతంగా.. కల్యాణ్ బాబాయ్ థాంక్ యూ సో మచ్ అని అల్లు అర్జున్ అనడంతో ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా అభిమానుల కేరింతలతో మారుమోగింది. అల్లు అర్జున్ వ్యాఖ్యల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.