Pushpa 2 The Rule: పుష్ప-2పై జాతీయ మీడియా రివ్యూలు, రేటింగ్ లు ఎలా ఉన్నాయంటే...!
- నేడు వరల్డ్ వైడ్ గా రిలీజైన పుష్ప-2
- తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్
- జాతీయ స్థాయిలో మిక్స్డ్ రివ్యూలు
- అదిరిపోయిన ఆడియన్స్ రివ్యూ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపుదిద్దుకున్న హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ పుష్ప-2 ది రూల్ నేడు (డిసెంబరు 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి పార్టు పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, పుష్ప-2పై భారీ స్థాయిలో బజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం 80 దేశాల్లో 12 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. మొదటి ఆట నుంచే పుష్ప చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
కాగా, పుష్ప-2పై పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి నెలకొనడంతో జాతీయ మీడియా ప్రత్యేకంగా రివ్యూలు ఇచ్చింది. ఇండియా టుడే, ఎన్డీటీవీలు పుష్ప-2 చిత్రంపై పెదవి విరిచాయి. పుష్ప-2 చిత్రం తన బరువు కింద తానే నలిగిపోయిందని ఎన్డీటీవీ పేర్కొనగా... అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూనే, ఈ చిత్రంలో కథను వెనక్కి నెట్టేశారని ఇండియా టుడే వెల్లడించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రం పాజిటివ్ రివ్యూ ఇచ్చింది. సుకుమార్ మేధాశక్తికి అల్లు అర్జున్ ప్రతిభ తోడైందని పుష్ప-2పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇక, టైమ్స్ నౌ మీడియా సంస్థ కూడా పుష్ప-2 మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ పేర్కొంది. అల్లు అర్జున్ నటన అదహో.... ఇది సుకుమార్ మార్క్ మాస్ ఎంటర్టయినర్ అని కితాబిచ్చింది.
ప్రఖ్యాత మీడియా సంస్థ ది హిందూ కాస్తంత నిరాశ ధ్వనించేలా రివ్యూ ఇచ్చింది. పుష్ప-2 ది రూల్ అసంపూర్ణంగా అనిపిస్తోందని పేర్కొంది. ది మింట్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత దూకుడు సెకండ్ పార్ట్ లో లేదని తెలిపింది. పైగా ఈ సినిమా సాగతీతగా ఉందని వివరించింది.
రేటింగ్ లు చూస్తే...
- టైమ్స్ ఆఫ్ ఇండియా- 3.5
- ఎన్డీటీవీ- 2.5
- ఇండియా టుడే- 2.5
- టైమ్స్ నౌ- 3.5
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... పుష్ప-2 చిత్రానికి ఆడియన్స్ రేటింగ్ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా 4.2/5 ఉండడం విశేషం.