ఇదెక్కడి రాజకీయం?.. కౌశిక్ రెడ్డి కేసు వ్యవహారంపై కేటీఆర్, హరీశ్ రావు ఘాటు స్పందన
- ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి ఏసీపీ, సీఐ పారిపోతున్నారన్న కేటీఆర్
- ప్రతిపక్ష ఎమ్మెల్యేను కలిసేందుకు కూడా భయమా అని ప్రశ్నించిన మాజీ మంత్రి
- ఇలాంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదన్న హరీశ్ రావు
- ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామంటూ హెచ్చరిక
అదిరేది లేదు, బెదిరేది లేదు: హరీశ్ రావు
ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడుతారని, పైగా ఉల్టా కేసు బనాయిస్తారా అని మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నించారు. ‘‘ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం?. ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా? రాజ్యాంగాన్ని కాపాడుదామంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని తిరుగుతారు. నువ్వేమో (రేవంత్ రెడ్డి) తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటావు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్ రావు అన్నారు.