బాలికపై యువకుడి అత్యాచారం... ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్థులు
- సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఉద్రిక్తత
- కార్లు ధ్వంసం చేసిన మహిళలు
- నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై గ్రామానికే చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మండిపడ్డారు. చుట్టుపక్కల వారితో కలిసి నిందితుడి ఇంటికి వెళ్లారు. అత్యాచారం విషయం తెలిసి గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి నిందితుడు పరారయ్యాడు.
గ్రామస్థుల ఆందోళన విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు వెనక్కి తగ్గలేదు. ఆగ్రహంతో నిందితుడి ఇంట్లో పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఇంటి ముందు నిలిపిన వాహనాలపై మహిళలు దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.