జనసేన 21కి 21 సీట్లు గెలవబోతోంది: నాగబాబు
- 21 మంది జనసేన ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెడతారన్న నాగబాబు
- పవన్ కల్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ మద్దతు ఫలించాయని వ్యాఖ్య
- జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని విశ్వాసం
అన్ని సర్వేలు, రిపోర్టులు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెబుతున్నాయని నాగబాబు ప్రస్తావించారు. జనసేన పార్టీ 21 స్థానాల్లోనూ విజయం సాధించబోతోందనే సమాచారం ఉందని అన్నారు. ఎవరి నియోజకవర్గంలో వారు ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అయితే వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగారని నాగబాబు అన్నారు. పార్టీ శ్రేణులందరికీ పవన్ కల్యాణ్ వెన్నెముక అని వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల రాజకీయ అనుభవం, శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ 10 సంవత్సరాలుగా పవన్ కల్యాణ్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని నాగబాబు కొనియాడారు.
పవన్ కల్యాణ్ శ్రమ వృథా కారాదనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా పనిచేశారని నాగబాబు అన్నారు. ప్రతిచోటా జనసేన కార్యకర్తలు ముందున్నారని అన్నారు. టీడీపీ, బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో సైతం జనసేన కార్యకర్తలు, వీరమహిళలు గట్టిగా నిలబడ్డారని ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో పరిస్థితులు వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవని అన్నారు.