జూన్ 4న వైసీపీ పెద్దకర్మలో అందరం పాలుపంచుకుందాం: రఘురామకృష్ణరాజు
- నేడు రఘురామకృష్ణరాజు బర్త్ డే
- తన జన్మదినం నాడే వైసీపీ పతనమైనందుకు సంతోషంగా ఉందన్న రఘురామరాజు
- రాజకీయ చిత్రపటంలో ఇక వైసీపీ కనిపించదని జోస్యం
- కూటమి విజయం తథ్యమని ధీమా
ఈ ఎన్నికల్లో విధుల్లో ఉన్న దాదాపు 4.5 లక్షల మంది ఓటు వేశారని, ఇంతమంది ఓటువేయడం చరిత్రలోనే ఇది తొలిసారని పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ కూటమికే ఓటు వేశారని తెలిపారు. ఈసారి హైదరాబాద్ నుంచి సంక్రాంతికి మించి సొంతూళ్లకు తరలివచ్చి ఓటేశారని, ఓ రాక్షసుడిని వదిలించుకోవాలన్న కసితో పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి దాదాపు 20 లక్షల మంది తరలి వచ్చారని, వారిలో ఒక పదిశాతం మినహా మిగతా అందరూ కూటమికే ఓటువేశారని వివరించారు.
మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైసీపీకి ఓటేశారని వారి పేపర్‌లో రాసుకున్నారని, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేయడం నిజమేనని, కాకపోతే వారు ఓటు వేసింది మాత్రం టీడీపీకేనని చెప్పారు. తమ పుస్తెలతో ఆటలాడుకున్నందుకు వారంతా కోపంగా ఉన్నారని, వారు ఓటు వేసింది తమకేనని రఘురామకృష్ణరాజు తెలిపారు.