2019లో పవన్ కల్యాణ్ ను గెలిపించుకోలేని మనకు.. ఆయనను అడిగే హక్కు ఎక్కడిది?: హైపర్ ఆది
- 24 సీట్లు మాత్రమే తీసుకున్నారంటూ పవన్ పై సొంత అభిమానుల విమర్శలు
- కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి పవన్ అన్న ఆది
- మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడొద్దని హితవు
కేవలం 24 సీట్లకే తలొగ్గడం ఏమిటని పవన్ గురించి మాట్లాడుతున్నారని... 2019లో ఆయనను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా? అని హైపర్ ఆది ప్రశ్నించాడు. సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ అని కొనియాడాడు. రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసకునే పవన్... సంపాదన మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు పెట్టేసి... ఇప్పుడు దాదాపుగా అప్పు చేసి పార్టీని నడుపుతున్నారని చెప్పాడు. చిన్న పరీక్షలో ఫెయిల్ అయతేనే మనం పది రోజులు బయటకు రాలేమని... అలాంటిది రెండు చోట్ల ఓడిపోయినా రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తీర్చిన గొప్ప మనసు పవన్ దని కొనియాడాడు.
కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టారని, ప్యాకేజీ తీసుకున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నారని... ఇలాంటి మాటలు ఎందుకని హైపర్ ఆది అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికారంలో ఉన్న వైసీపీ వద్ద ఎక్కువ డబ్బు ఉందని... అలాంటప్పుడు వైసీపీ దగ్గరకు పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించాడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం... అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదని అన్నాడు. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానం అంటారని చెప్పారు. మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదని హితవు పలికాడు.