కమల్ నాథ్ ముఖ్యమంత్రి కావాలని తాంత్రిక పూజలు.. మధ్యప్రదేశ్ లో కలకలం
- కమల్ నాథ్ ఫొటోతో క్షుద్ర పూజలు చేస్తున్న ఫొటోలు వైరల్
- కమల్ సీఎం కావాలని పూజలు చేస్తున్నానని చెప్పిన తాంత్రిక పూజారి
- క్షుద్ర పూజలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్న శివరాజ్ సింగ్ చౌహాన్
కమల్ నాథ్ ఫొటో ముందు పూలు, కుంకుమ, నిమ్మకాయలు వంటి సామగ్రితో క్షుద్ర పూజలు చేస్తున్నట్టుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, కమల్ నాథ్ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు చేస్తున్నట్టు తాంత్రిక పూజారి భయ్యూ మహారాజ్ ఓ టీవీ ఛానల్ ప్రతినిధికి చెప్పాడు.
ఇదిలావుంచితే, దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. క్షుద్ర పూజలు చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన విమర్శించారు. అధికారంలోకి రావాలంటే ప్రజలకు సేవ చేయాలని అన్నారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తాము ప్రజలకు దగ్గరవుతున్నామని... కొందరేమో శ్మశానాల్లో తాంత్రిక పూజలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. వీటివల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించారు.