సినిమా హీరోలూ... మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
- చంద్రబాబు అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
- జగన్ ముందు వణికిపోతూ కూర్చున్నారని ఎద్దేవా
- రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని విన్నపం
జగన్ ను కలిసేందుకు సినిమా హీరోలు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారని, కొందరు సొంత ఫ్లైట్లో వచ్చారని... కానీ జగన్ తో పాటు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు వణికిపోతూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. మీ పరిస్థితి ఏందో ఆరోజు మీకు అర్థం కాలేదా? అని ప్రశ్నించారు. ఎందుకయ్యా మీకు రోల్స్ రాయిస్ కార్లు? ఎందుకయ్యా మీకు సినిమా స్టార్ డమ్? అని ఎద్దేవా చేశారు. మీ సినిమా టికెట్ల పరిస్థితి ఏందో తెలియదా? అని ప్రశ్నించారు. మీరెక్కడ హీరోలండీ అని దుయ్యబట్టారు. మిమ్మల్ని రాజకీయాలు మాట్లాడమని తాను చెప్పడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసి రావాలని మాత్రమే కోరుతున్నానని చెప్పారు.
హీరోలంతా తెలంగాణలో సెటిల్ అయిపోయారని.... ఏపీకి వాళ్లేమీ చేయరని జేసీ విమర్శించారు. రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రభుత్వం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోబోతున్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో పిల్లలు ఏమైపోతారో అనే భయం తమకు ఉందని చెప్పారు. మాట్లాడటానికి, కూర్చోవడానికి, నిలబడేందుకు కూడా అవకాశం లేదని అన్నారు. ఎందుకండీ మీరంతా... మీరు బ్రహ్మాండంగా ఉంటే చాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు.
మీరెవరూ సంతోషంగా ఉండలేరని... మీకు ఇక్కడ కూడా ఆస్తులు ఉన్నాయని జేసీ హెచ్చరించారు. మీ స్థలాలు, ఆస్తుల రికార్డులు ఇవ్వాలని అడుతున్నారని తమ ఊరిలో చెపుతున్నారని... అంటే చివరకు అందరి ఆస్తులను తాకట్టు పెడతారని అన్నారు. పరిస్థితి బాగోలేదని, హీరోలు బయటకు రావాలని కోరారు. మీరు ఇలాగే ఉంటే... మీ రోల్స్ రాయిస్ కార్లు కూడా తీసుకెళ్లి తాకట్టు పెడతారని చెప్పారు. ఏపీకి భవిష్యత్తు కనిపించడం లేదని... రాష్ట్రాన్ని రక్షించేందుకు అందరూ బయటకు రావాలని కోరారు.