పుతిన్ బాటలో చైనా అధినేత జిన్‌పింగ్.. భారత్ వచ్చేందుకు విముఖత!
- సెప్టెంబర్ 9,10వ తేదీల్లో ఢిల్లీలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు
- హాజరుకానున్న జో బైడెన్ సహా పలు దేశాల అధినేతలు
- సదస్సుకు రావడం లేదని ఇప్పటికే ప్రకటించిన పుతిన్
మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా జీ20 సమ్మిట్ కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ భారత్ రావొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు జిన్ పింగ్ హాజరుకారని చైనాలో పని చేస్తున్న భారత దౌత్యవేత్తలు వెల్లడించారు. దీనిపై ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జిన్ పింగ్ గైర్హాజరీకి గల కారణాలను చైనా అధికారులు స్పష్టం చేయడం లేదు.