కర్ణాటక సీఎం సలహాదారుగా సునీల్ కనుగోలు
- కేబినెట్ హోదాతో నియామకం.. దాదాపుగా ఖరారు
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన సునీల్
- పే సీఎం, 40 శాతం ప్రభుత్వం నినాదాల రూపకర్త
ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు సంపాదించుకున్న సునీల్ కనుగోలు మొదట ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ లో చేరారు. 2014లో ఎన్డీఏ సర్కారును కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఆపై పీకేతో విడిపోయి తనే సొంతంగా మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్థను ప్రారంభించారు. డీఎంకే, అన్నాడీఎంకే, శిరోమణి అకాలీదళ్ పార్టీలకు వ్యూహకర్తగా సేవలందించారు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచార వ్యూహకర్తగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఓటమికి కారణమైన పే సీఎం, 40 శాతం కమిషన్ సర్కారు.. నినాదాలను సునీల్ కనుగోలు రూపొందించాడు. కర్ణాటకలోని బళ్లారి మూలాలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.