దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతా మృతి .. నెల రోజుల్లో రెండో ఘటన
- దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చీతాల్లో ‘ఉదయ్’ ఒకటి
- నిన్న ఉదయం అనారోగ్యంతో కనిపించిన చీతా
- చికిత్స అందిస్తుండగా సాయంత్రం 4 గంటలకు మృతి
- మార్చిలో నమీబియా చీతా ‘సాషా’ కన్నుమూత
‘ఉదయ్’ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆదివారం ఉదయం అటవీ బృందం గుర్తించింది. ఆ తర్వాత దానిని చికిత్స కోసం మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందింది. పశువైద్య బృందం దానికి పోస్టుమార్టం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. అందులో ఉదయ్ ఒకటి. గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటైన సాషా ఈ ఏడాది మార్చిలో కన్నుమూసింది. నెల రోజుల వ్యవధిలో ఇప్పుడు మరో చీతా మరణించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు చీతాలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడున్న చీతాల సంఖ్య 18కి పడిపోయింది.