వివేకా హత్య కేసు: హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట
- 25వ తేదీ వరకు రోజూ సీబీఐ విచారణకు
- ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశం
- ముందస్తు బెయిల్ పైన 25వ తేదీన తుది తీర్పు
అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన న్యాయమూర్తి నిన్న, ఈ రోజు వాదనలు విన్నారు. ఈ రోజు వాడి వేడిగా వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అవినాశ్ రెడ్డికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనను అరెస్ట్ చేయాలని సీబీఐకి అంత ఆతృత ఎందుకు అని ఎంపీ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసు రోజున మృతదేహం వద్దకు అవినాశ్ వెళ్లే వరకు చాలామంది ఉన్నారని చెప్పారు. సాక్ష్యాలు తారుమారు చేసే ఆలోచన లేదన్నారు. ఈ హత్యకు కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు కావొచ్చునని, రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చునని వాదనలు వినిపించారు. అవినాశ్ కు మాత్రం ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.
మరోవైపు, సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ వివేకా హత్య వెనుక కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు లేవని కోర్టుకు తెలిపారు. అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని, ఆయన సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేశారని కోర్టుకు తెలిపారు. వైఎస్ వివేకా కూతురు సునీత కూడా ఇంప్లీడ్ అయి తన వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పును 25వ తేదీకి వాయిదా వేశారు.