Virat Kohli: నా జీవితాన్ని మలుపు తిప్పిన క్షణమేదంటే: కోహ్లీ వీడియో ఇదిగో
- వరల్డ్ కప్ అందుకోవడం, కెప్టెన్సీ చేపట్టడమూ కాదన్న క్రికెటర్
- అనుష్క పరిచయం తన జీవితంలోని మరో కోణాన్ని చూపెట్టిందని వెల్లడి
- తండ్రి మరణం తనపై చూపిన ప్రభావం గురించి చెప్పిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్
- వీడియో షేర్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్
విరాట్ కోహ్లీ.. దేశవిదేశాల్లోని క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరిది. తన ఆటతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న టీం ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గురించి అభిమానులకు తెలియని విషయంలేదు. అయితే, తన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన గురించి కోహ్లీ తాజాగా బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ స్వయంగా చెప్పిన వివరాలను, ఇంటర్వ్యూ వీడియోను ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కోహ్లీ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన బహుశా అండర్ 19 జట్టు కెప్టెన్ గా వరల్డ్ కప్ అందుకోవడమో లేక భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన క్షణమో అని అనుకోవడం సహజం. అయితే, అవేవీ కాదని, అనుష్కను తొలిసారి కలిసిన క్షణమే తన జీవితంలో గొప్ప మార్పుకు నాంది అని కోహ్లీ చెప్పాడు. అనుష్క పరిచయం తనలో సరికొత్త మార్పును తీసుకొచ్చిందని కోహ్లీ చెప్పాడు. జీవితాన్ని మరో కోణంలో చూడడం అలవాటైందని వివరించాడు. గతంలో తనకలాంటి అనుభవం ఎన్నడూ కలగలేదని తెలిపాడు.
అనుష్కతో డేటింగ్ మొదలుపెట్టాక తాను చాలా మారానని, కొత్త విషయాలను నేర్చుకున్నానని పేర్కొన్నాడు. తండ్రి మరణం కూడా తనపై చాలా ప్రభావం చూపిందని చెప్పుకొచ్చాడు. జీవితంలో ఏంచేయాలి, ఎలా చేయాలనే విషయంపై మరింత ఫోకస్ పెట్టేలా ఆ సంఘటన తోడ్పాటు అందించిందని తెలిపారు. తన డ్రీమ్ ను సాధించేందుకు కృషి చేసేలా ప్రోత్సహించిందని కోహ్లీ చెప్పాడు. అయితే, అనుష్కతో పరిచయం మాత్రం తన జీవితంలో కొత్త కోణాన్ని చూపెట్టిందని కోహ్లీ వివరించాడు.