వసంత వెంకట కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. అమరావతికే తన మద్దతన్న వైసీపీ ఎమ్మెల్యే
- ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా కవులూరులో పర్యటించిన ఎమ్మెల్యే
- అమరావతిపై మీరెందుకు నోరు మెదపడం లేదన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు
- ప్రభుత్వ విధానానికే తాను కట్టుబడి ఉండాలన్న ఎమ్మెల్యే
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నిన్న కవులూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు ఆయనతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిపై మీరెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజధానిపై ప్రజల్లో అయోమయం నెలకొనడంతో తమ భూముల ధరలు పతనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారు.
స్పందించిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్.. వ్యక్తిగతంగా తన మద్దతు అమరావతికేనని, కాకపోతే ప్రభుత్వ విధానానికే తాను కట్టుబడి ఉండాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను చేసేదేమీ లేదని స్పష్టం చేశారు.