కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
- టీపీసీసీ కొత్త కమిటీలకు హైకమాండ్ ఆమోద ముద్ర
- ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీల్లో వెంకట్ రెడ్డికి చోటు దక్కని వైనం
- రేవంత్ రెడ్డితో విభేదాలే కారణమంటూ చర్చ!
కొన్నాళ్లుగా పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతకాలంగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ కొత్త కమిటీల్లో చోటు ఇవ్వలేదని తెలుస్తోంది. రేవంత్ తో విభేదాల కారణంగానే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామం తర్వాత వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.