నాపై నేనే సీబీఐ విచారణ కోరతా... అందుకు మీరూ సిద్ధమేనా?: వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి
- ప్రొద్దటూరులో టీడీపీ నేత ఇంటిని ముట్టడించిన పొదుపు మహిళలు
- ఈ వ్యవహారంపై రాచమల్లుపై ఆరోపణలు గుప్పించిన లోకేశ్, అచ్చెన్న,సోమిరెడ్డి
- టీడీపీ నేతల ఆరోపణలపై ప్రతిస్పందించిన వైసీపీ ఎమ్మెల్యే
ఇటీవలే ప్రొద్దటూరులో ఓ మహిళ పొదుపు సంఘాలకు చెందిన మహిళల వద్ద అక్రమంగా వసూళ్లు చేపడితే... ఆమెకు స్థానిక టీడీపీ నేత మద్దతు పలికారని ఆరోపిస్తూ... టీడీపీ నేత ఇంటిని బాధిత మహిళలు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సదరు టీడీపీ నేతను వెనకేసుకుని వచ్చిన లోకేశ్, అచ్చెన్న, సోమిరెడ్డిలు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.
ఈ ఆరోపణలపై ప్రతిస్పందించిన శివప్రసాద్ రెడ్డి... తన రాజకీయ జీవితంలో ఏనాడూ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. ఈ విషయాన్ని దమ్ముంటే నిరూపించాలని ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ నేతలతో ఆ పని కాకుంటే... తానే స్వయంగా తనపైనే సీబీఐ విచారణకు కోరతానన్న శివప్రసాద్ రెడ్డి...తనపై ఆరోపణలు గుప్పించిన నేతలు కూడా తన మాదిరిగానే సీబీఐ విచారణ కోరగలరా? అని ఆయన ప్రశ్నించారు.