నూడుల్స్ సూప్ తో రైలు నడిపారు.. జపాన్ లో సరికొత్త ప్రయోగం.. వీడియో ఇదిగో
- రామెన్ సూప్, టెంపురా వంటకాల వ్యర్థాల నుంచి బయో డీజిల్
- రసాయనాలతో శుద్ధి చేసి రూపొందించిన నిపుణులు
- దానితో ప్రయోగాత్మకంగా రైలును నడిపిన జపాన్ రైల్వే అధికారులు
రెండు ప్రత్యేక వంటకాల నుంచి..
జపాన్ వాసులు టొంకుట్సు రామెన్ సూప్ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలతోగానీ, మాంసంతోగానీ చేసే డీప్ ఫ్రై) వంటకాలను చాలా ఇష్టంగా తింటారు. ఇళ్లలో, రెస్టారెంట్లలో ఈ వంటకాలు పెద్ద ఎత్తున తయారు చేస్తుంటారు. అదే స్థాయిలో ఈ వంటకాలు వృథా అవుతుంటాయి కూడా. ఈ వృథాను అరికట్టడం, పర్యావరణానికి మేలు చేయడం లక్ష్యంగా.. జపాన్ టాకచిహో రైల్వే అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. వృథా ఆహార పదార్థాల నుంచి బయో డీజిల్ తయారు చేసి రైలును నడపాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను నిషిడా షౌన్ అనే రవాణా కంపెనీకి అప్పగించారు.
రెస్టారెంట్ల నుంచి వ్యర్థాలను సేకరించి..
- నిషిడా షౌన్ సంస్థ జపాన్ లోని పలు రెస్టారెంట్ల నుంచి రామెన్ సూప్, టెంపురా వంటకాల వ్యర్థాలను సేకరించింది. వాటిని కలిపి రసాయనాలతో శుద్ధి చేసి.. బయో డీజిల్ ను తయారు చేసింది.
- మొదట ఈ బయో డీజిల్ తో కొన్ని రైలింజన్లను ప్రయోగాత్మకంగా నడిపి చూసింది. అది విజయవంతంగా కావడంతో ఇటీవల మియాజాకీ నగరంలో పూర్తిస్థాయిలో ఓ చిన్న ప్రయాణికుల రైలును ఆ వృథా బయో డీజిల్ తో నడిపింది.
- ఈ రామెన్ సూప్ బయో డీజిల్ తో కూడిన రైలు వెళుతుంటే.. దాని నుంచి వెలువడిన పొగలు సదరు వంటకం వాసనను వెదజల్లాయని ప్రయాణికులు చెబుతున్నారు.
- సదరు రైల్వే సంస్థ ఈ ప్రత్యేక రైలు ప్రయాణాన్ని డ్రోన్లతో వీడియో తీసి విడుదల చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.