'గాడ్ ఫాదర్' లో నన్ను కాకుండా సల్మాన్ ను ఎందుకు తీసుకున్నారన్న ఆమిర్ ఖాన్... చిరంజీవి జవాబు ఇదిగో!
- ఆమిర్ ఖాన్ హీరోగా లాల్ సింగ్ చడ్డా
- చిరంజీవి సమర్పణలో తెలుగు వెర్షన్
- చిత్రంలో కీలకపాత్రలో నాగచైతన్య
- లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్ ఈవెంట్లో ఆసక్తికర సంభాషణ
తనకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని... చిరంజీవి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమిర్ ఖాన్ చెప్పారు. అనంతరం మాట్లాడుతూ... గతంలో చిరంజీవితో కలిసి నటించాలని ఉందని చెప్పానని, తప్పకుండా అవకాశం ఇస్తానని చిరంజీవి చెప్పారని వెల్లడించారు. కానీ 'గాఢ్ ఫాదర్' చిత్రంలో సల్మాన్ ఖాన్ ను తీసుకున్నామని చిరంజీవే రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పారని ఆమిర్ వివరించారు.
నన్ను కాకుండా సల్మాన్ ను ఎందుకు తీసుకున్నారని చిరంజీవిని అడిగినట్టు చెప్పారు. అందుకు చిరంజీవి... ఇది హృదయం, బుద్ధిబలానికి సంబంధించిన పాత్ర కాదని, కండబలానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో సల్మాన్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నామని వివరణ ఇచ్చారని ఆమిర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.