కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్... ఈ నెల 10 నుంచి అమలు
- కర్ణాటకలో కరోనా బీభత్సం
- నిన్న 49 వేలకు పైగా పాజిటివ్ కేసులు
- బెంగళూరులోనూ కరోనా ఘంటికలు
- కఠిన నిర్ణయం తీసుకున్న సీఎం యడియూరప్ప
- ఈ నెల 24 వరకు లాక్ డౌన్
ఈ నెల 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం యడియూరప్ప వెల్లడించారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కరిని కూడా బయటకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని హోటళ్లు, పబ్ లు, బార్లు మూసివేయాలని అన్నారు. ఫలహార శాలలు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అనుమతిస్తారని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యలో విపరీతమైన పెరుగుదల, అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండడంతో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యడియూరప్ప వివరణ ఇచ్చారు. అయితే, ఇది తాత్కాలిక లాక్ డౌన్ మాత్రమేనని, వలస కూలీలు తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.