పరిస్థితి చెయ్యి దాటకముందే లాక్ డౌన్ పై ఆలోచించండి: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన!
- ప్రజలు గుమికూడే కార్యక్రమాలను రద్దు చేయండి
- లాక్ డౌన్ విధించే పక్షంలో పేదలు ఇబ్బంది పడకుండా చూడాలి
- కరోనా నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి
- జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు
లాక్ డౌన్ ను మరోసారి విధించాలని నిర్ణయిస్తే, ప్రభావితం చెందే పేద ప్రజలకు ఆహారాన్ని అందించి, వారి అవసరాలను తీర్చే దిశగా ముందస్తుగానే ప్రణాళికలను రూపొందించుకోవాలని ధర్మాసనం సూచించింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల రికార్డులను అందించాలని ఆదేశించింది.
కరోనా నియంత్రణపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఏ ఒక్క కరోనా బాధితుడికి కూడా ఆసుపత్రిలో పడక లేదని చెప్పకుండా చూసుకోవాలని, అత్యవసరమైన ఔషధాలను అన్ని ఆసుపత్రులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బాధితుడు ఏ ప్రాంతం వాడైనా, స్థానికంగా నివాసం లేకున్నా, గుర్తింపు కార్డును చూపించకున్నా అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది.