గుంటూరులో ఘటన.. మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్ పై యువకుడి దాడి!
- ఈరోజు బ్రాడీపేటలో పర్యటించిన కార్పొరేటర్ వెంకటకృష్ణాచారి
- మాస్క్ ధరించని యువకుడిని మందలించిన వైనం
- గొడవ తర్వాత యువకులను చితకబాదిన కార్పొరేటర్ అనుచరులు
వివరాల్లోకి వెళ్తే, గుంటూరు 32వ డివిజన్ కార్పొరేటర్ వెంకటకృష్ణాచారి ఈరోజు బ్రాడీపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా నాలుగో లైన్ లో ఉన్న బోయ్స్ హాస్టల్ వద్ద కొందరు యువకులు గుమికూడి ఉండటాన్ని గమనించారు. వారిలో మాస్క్ ధరించని యువకుడిని ఆయన మందలించారు. ఈ నేపథ్యంలో, ఇరువురికీ మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం యువకుడిపై సదరు కార్పొరేటర్ చేయి చేసుకున్నారు. దీంతో ఆ యువకుడు కార్పొరేటర్ పై తిరగబడ్డాడు. మా అమ్మానాన్నలే నన్ను కొట్టరని... నన్ను కొట్టడానికి నీవెవరంటూ తన స్నేహితులతో కలిసి కార్పొరేటర్ ను కొట్టాడు.
ఆ తర్వాత దాడి గురించి తెలుసుకున్న కార్పొరేటర్ అనుచరులు హాస్టల్ వద్దకు వచ్చి... సదరు యువకులను బయటకు తీసుకొచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి, యువకులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.