కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేది లేదు: రైతు సంఘం నేత
- కొత్త చట్టాలతో పౌర సరఫరాల వ్యవస్థ నాశనం
- ఇవి బడా కార్పొరేట్లకు మేలు చేసేవే
- మహా పంచాయత్ ను ఉద్దేశించి రాకేశ్ తికాయత్
"రైతులకు మేలు కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకూ తమ ఆందోళనలు ఆగబోవు. మా డిమాండ్లను నెరవేర్చాల్సిందే. ఈ చట్టాల రద్దును మాత్రమే మేము కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు. ఈ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే నష్టదాయకం కాదని, చిన్న చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు తదితరులపైనా ప్రభావం చూపనున్నాయని చెప్పారు. ఆసలు ఏ ఉద్దేశంతో ఈ చట్టాలను తీసుకునివచ్చారో కూడా తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
'ముందు గోడౌన్ లను నిర్మించారు. ఆ తరువాత చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాత్రమే లాభాన్ని చేకూరుస్తాయన్న సంగతి రైతులకు తెలియదా ఏమిటీ?' అని ఆయన అన్నారు. ఆకలిపై వ్యాపారం చేస్తామంటే, అంగీకరించే పరిస్థితి ఈ దేశంలో లేదని స్పష్టం చేశారు. రైతుల నిరసనలకు సింఘూ సరిహద్దులే కేంద్రంగా ఉంటాయని ఆయన అన్నారు.