అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోనున్న రజనీకాంత్.. అభిమానులతో కీలక భేటీ
- చెన్నైలోని ఫంక్షన్ హాల్ లో సమావేశం
- అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం
- #RajinikanthPoliticalEntry హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానుల పోస్టులు
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచించుకుంటుండగా రజనీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.
ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని అభిమానులు చాలా సార్లు ఆయన ఇంటి వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీనిపై రజనీ మాత్రం ఇన్నాళ్లూ మౌనం వహిస్తూ వచ్చారు. అందుకే, రాజకీయ అరంగేట్రం గురించి చర్చించడానికే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఆయన పుట్టినరోజు (డిసెంబరు 12)న రాజకీయ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో #RajinikanthPoliticalEntry అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు చేస్తున్నారు.