'పక్క రాష్ట్రంలో పనికి రాని వ్యక్తి' అంటూ పవన్ కల్యాణ్ పై బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు
- రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదు
- హైదరాబాద్ రాజకీయాలతో ఏం పని?
- బండి సంజయ్ హోదాకు తగ్గట్టు వ్యవహరించాలి
పక్క రాష్ట్రంలో దేనికీ పనికి రాని వ్యక్తికి హైదరాబాద్ రాజకీయాలతో ఏం పనో అని బాల్క సుమన్ సెటైర్ వేశారు. ఏపీలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఒక్క చోట కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని అన్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు హైదరాబాదులో ప్రచారం చేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ఈ రాజకీయాలు ఏంటో వారికే తెలియాలని అన్నారు.
గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారేనని బాల్క సుమన్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ఆయన హోదాకు తగ్గట్టు వ్యవహరించాలని అన్నారు. బీజేపీ పాలిస్తున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని... అవి మానేసి దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు.