Kamal Haasan: నా తదుపరి బర్త్ డేని సీఎం ఆఫీసులో జరుపుకుందాం: కమలహాసన్
- ఇటీవల కమల్ బర్త్ డే
- సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు
- వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కేందుకు కష్టపడతానని హామీ
తమిళనాడులోని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమలహాసన్ ఇటీవల పుట్టినరోజు వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నిన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. తన తదుపరి పుట్టినరోజును తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుందామని ఆయన అనడం గమనార్హం.
తనకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని కమల హాసన్ అన్నారు. వారందరి శుభాకాంక్షలు తన పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చాయని తెలిపారు. తన బర్త్ డే రోజున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న తమ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు.
వారి కష్టానికి, ప్రేమకు తగ్గ ఫలితం దక్కేందుకు తాను తమిళనాడు రాజకీయాల్లో కష్టపడతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి పుట్టినరోజును ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుందామని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.