తెలుగు, తమిళ రాష్ట్రాల్లో 'కల్కి' లీలలు : గుట్టలుగా నోట్ల కట్టలు, బంగారం
- రూ.600 కోట్లకు పైగా సొత్తు
- క్లయింట్లు ఇచ్చిన డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు
- ఎల్‌ఐసీ ఏజెంట్ స్థాయి నుంచి అందనంత ఎత్తుకు
కల్కి ఆశ్రమాలపై ఈనెల 16న ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. ఆశ్రమానికి సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఉన్న కేంద్రాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. తొలిరోజు దాడుల్లోనే స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాల విలువ రూ.93 కోట్లు ఉంటుందని తేల్చారు. ఇందులో 43.9 కోట్లు నగదు రూపంలో ఉండగా, రూ.18 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు, 26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువ చేసే 1271 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి.
అయితే లెక్క తేలని ఆదాయం మరో రూ.500 కోట్ల వరకు ఉంటుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. కల్కి అనుబంధ సంస్థలు చైనా, అమెరికా, సింగపూర్, యూఏఈల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించారు. దేశీయంగా కల్కి సంస్థలు నిర్వహిస్తున్న కోర్సులకు దేశవిదేశాల నుంచి క్లయింట్లు హాజరవుతుంటారు.
వారి నుంచి వచ్చే డబ్బులో పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని తమ గ్రూపు కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అలాగే, విదేశీ క్లయింట్ల నుంచి నగదు రూపంలో తీసుకుంటున్న మొత్తానికి కూడా సరిగా లెక్కలు చూపడం లేదని తేల్చారు.