నాగ మారుతీ శర్మ సాక్ష్యంతో అడ్డంగా ఇరుక్కున్న గాలి జనార్దన్ రెడ్డి!
- గాలి బెయిల్ డీల్ కేసులో ప్రధాన సాక్షిగా శర్మ
- నిన్న ఏసీబీ కోర్టులో వాంగ్మూలం
- రూ. 40 కోట్లు ఇవ్వజూపారని సాక్ష్యం
గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో జనార్దనరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన వేళ, బెయిల్ కోసం సీబీఐ కోర్టు మరో న్యాయమూర్తి, పట్టాభి రామారావుకు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేయగా, దానిపై ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. నాచారం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ యాదగిరి మధ్యవర్తిగా బేరం సాగగా, నాటి సీబీఐ కోర్టు జడ్జి పట్టాభిరామారావు జనార్దన రెడ్డికి బెయిలు మంజూరు చేశారు. అంతకన్నా ముందు మరో న్యాయమూర్తి, నేటి సాక్షి నాగమారుతి శర్మతోనూ బేరం జరిగింది.
అయితే, నాగమారుతి శర్మ డబ్బులు తీసుకుని బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. మొత్తం ఉదంతం బయటకు పొక్కిన తరువాత, పట్టాభి రామారావుపై కేసు నమోదైంది. అప్పట్లో సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న శర్మను ఏసీబీ అధికారులు నాల్గవ సాక్షిగా చేర్చారు. గాలి జనార్దన రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే, రూ.40 కోట్లు ముట్టజెప్పుతామని తనకు ఆఫర్ వచ్చిందని, దాన్ని తాను అంగీకరించలేదని ఏసీబీ కోర్టులో సోమవారం నాడు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.